చిటపట చినుకులు: మేఘసందేశం

Saturday, June 22nd, 2013, 02:30:10 PM IST


ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడి.. రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖలో తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గడచిన 24 గంటల్లో విశాఖ జిల్లా భీముని పట్నంలో నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, ధవళేశ్వరంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో ఒక సెంటీమీటర్ వర్షం కురిసింది.

తెలంగాణ:
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. గడచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్, నిజామాబాద్, రుద్రూరు, కామారెడ్డిలలో రెండేసి సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. వరంగల్ జిల్లా హన్మకొండలో ఒక సెంటీమీటర్ వర్షం పడింది. ఇక నల్గొండ, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.

రాయలసీమ:
అల్పపీడన ప్రభావం వల్ల రాయలసీమలోనూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనంతపురంలో రెండు మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఒక మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది.

ఇక వచ్చే 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని విశాఖలో తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడితే దానికి తోడు ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.