మెకానిక్ తనయుడే..కానీ ఎంఐటీ విజేత!

Monday, April 13th, 2015, 10:11:15 AM IST

Ayush-Sharma
అమెరికాలో ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో కాన్పూరుకు చెందిన 17ఏళ్ళ ఆయుష్ శర్మకు ప్రవేశం లభించింది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఆయుష్ ఉన్నత చదువుకు అవకాశం కల్పించిన ఎంఐటీ అతనికి పూర్తిగా ట్యూషన్ ఫీజు నుండి రాయితీను కల్పించింది. కాగా ఆయుష్ తండ్రి ప్రస్తుతం స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లో మెకానిక్ గా పనిచేస్తున్నారు. ఇక అయిష్ కుటుంబంలో పూర్తి స్థాయి డిగ్రీ విద్యనే చదివిన వారు లేకపోవడం విశేషం. అలాగే ఆయుష్ తండ్రి కూడా మెకానిక్ గా చేరే ముందు డిప్లొమాను పూర్తి చేసినట్లు తెలిపారు.

ఇక దీనిపై ఆయుష్ మాట్లాడుతూ తాను 7,8 తరగతులు చదువుతున్నప్పటి నుండే ఎంఐటీ గురించి తెలుసుకున్నాననీ, అయితే అందులో ప్రవేశం జరుగుతుందని ఊహించలేదని తెలిపారు. అలాగే ప్రభుత్వ కేంద్రీయ విద్యాలయంలో విద్యను అభ్యసించిన ఆయుష్ రాత పరంగా ఇంగ్లీష్ లో మంచి పట్టు ఉన్నప్పటికీ అతనికి ఆ బాషలో మాట్లాడడం కాస్త ఇబ్బంది కరమైన అంశంగా ఉండేదట. అలాగే ఎంఐటీలో ప్రవేశానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా ఆయుష్ కు అంతుపట్టని విషయంగా ఉండేదని తెలుస్తోంది.

అయితే ఐఐటి అలుమ్ని వారు నడిపే ఒక సోషల్ ఎంటర్ ప్రైజ్ ‘అవంతి’ ద్వారా తాను మెళుకువలు నేర్చుకున్నానని ఆయుష్ తెలిపారు. ఇక ఆయుష్ మీద మసాచుసెట్స్ యూనివర్సిటీ నాలుగేళ్ల విద్య కోసం ఇంచుమించు కోటి రూపాయలు ఖర్చుపెట్టనుంది. కాగా అమెరికాకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం ఫండింగ్ కాంపెయిన్ ద్వారా ఆయుష్ ఆరు గంటల్లో 90వేల రూపాయలను సంపాదించడం విశేషం. ఇక కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చునని నిరూపించిన ఈ 17ఏళ్ళ కుర్రాడికి భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని ఆశిద్దాం.