గుజ‌రాత్ సీఎం గా మోడీ ఎవ‌రిని నియ‌మిస్తారు?

Tuesday, August 2nd, 2016, 01:17:06 PM IST

1
గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ఆనంది బెన్ ప‌టేల్ నిన్న రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఆమె స్థానంలో ఎవ‌రిని నియ‌మిస్తార‌న్నదానిపై ఉత్కంఠ నెల‌కొంది. గుజ‌రాత్ కొత్త ముఖ్య‌మంత్రి రేసులో ఇప్పుడు చాలామంది ఆశావ‌హులు లైన్ లో ఉన్నారు. మ‌రి ప్ర‌ధాని మోడీ వీరిలో ఎవ‌రిని గుజ‌రాత్ పీఠంపై కూర్చొబెడ‌తార‌న్న‌దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర ఉహాగానాలు చెల‌రేగుతున్నాయి. ఇప్ప‌టికే గుజ‌రాత్ సీఎంగా ఎవ‌రిని నియమించాలో మోడీ ఒక అంచ‌నాకు వ‌చ్చార‌ని రెండు మూడు రోజుల్లో సీఎం ఎవ‌ర‌న్న‌ది తేలిపోతుంద‌ని చెపుతున్నారు.

గుజ‌రాత్ సీఎం పీఠం ఆశిస్తున్న వారి జాబితాలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. గ‌తంలో గుజ‌రాత్ హోం మంత్రిగా ప‌నిచేసిన అమిత్ షా, పార్టీ ప్ర‌ధాన వ్యూహ‌క‌ర్త‌ల్లో ఒక‌రు. అమిత్ షాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా చేస్తార‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో వ‌స్తున్నాయి. అయితే అమిత్ షాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా చేయ‌డం మోడీ ఇష్టం లేద‌ని కొంద‌రు చెపుతున్నారు. ప్ర‌స్తుతం జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న అమిత్ ను గుజ‌రాత్ కు ప‌రిమితం చేయ‌డం మోడీకి న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది.

అమిత్ షా తో పాటు మ‌రికొంద‌రి పేర్లు కూడా గుజ‌రాత్ సీఎం రేసులో వినిపిస్తున్నాయి. గుజ‌రాత్ లో బ‌ల‌మైన నాయ‌కులుగా పేరుగాంచిన పురుషోత్తం రూపాల‌, నితిన్ పటేల్, విజ‌య్ రూసాని, శంక‌ర్ చౌద‌రి వంటి నేత‌లు సీఎం ప‌ద‌విని ఆశిస్తున్నారు. మోడీ త‌ర్వాత ఆ స్థాయిలో మంచి స్పీక‌ర్ గా గుర్తింపు పొందిన పురుషోత్తం రూపాల కూడా ఈ రేసులో ముందున్నారు. ఇక గుజ‌రాత్ ఆరోగ్య మంత్రి నితిన్ ప‌టేల్ కూడా సీఎం ప‌ద‌వి కోసం గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు. ఏది ఎలా ఉన్న సంఘ ప‌రివార్ ఆశీస్సులు ఉన్న‌వారికే గుజ‌రాత్ సీఎం ప‌ద‌వి ద‌క్కుతుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.