రాబోయే ఎన్నికల్లో ‘పవన్ కల్యాణ్’ పొలిటికల్ మైలేజ్ ఎంత..?

Saturday, May 7th, 2016, 09:19:39 AM IST


పవన్ కళ్యాణ్.. తెలుగు చిత్ర సీమలో ఈ పేరుకు కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఇదే పేరు తెలుగు రాజకీయాల్లో సైతం జోరుగా వినిపిస్తోంది. 2014 లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి టీడీపీ 10 ఏళ్ళ తరువాత అధికారం చేపట్టడంలో కీలక పాత్ర పోషించిన పవన్ ఎన్ని ఎలక్షన్స్ వచ్చిన పోటీ చేయలేదు. కానీ ఈసారి 2019 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే రంగంలోకి, అదీ అధికార టీడీపీని ఎదిరించి దిగుతానని అంటున్నాడు. కానీ ఒక్కసారి అసలు ఎన్నికల రేసులో పవన్ మైలేజ్ ఎంత అనేది బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సారి ఎన్నికల్లోఅధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కాకుండా జనాల దృష్టిని ఆకర్షించగల పార్టీ పవన్ జనసేన మాత్రమే. రాజశేఖర రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ ఎలాగు భూస్థాపితమైంది. కాబట్టి మూడవ ప్రత్యాన్మాయం పవన్ ఒక్కడే.

ఇక రాజకీయ బలా బలాల విషయానికొస్తే రాష్ట్రంలో దాదాపు 75% మంది సీనియర్, బలమైన నాయకులు టీడీపీలోనే ఉన్నారు. మిగిలిన అరకొర నాయకులు వైసీపీలో ఉన్నారు. పవన్ పార్టీలో పవన్ తప్ప ఎవ్వరూ లేరు. దీంతో ఒక్క పవన్ ను చూసే అన్ని చోట్ల ఓట్లు రాలతాయా అంటే అదీ అసాధ్యమే. అలాగే రాజకీయ వాతావరణం చూస్తే ప్రత్యేక అంశం, ఎమ్మెల్యేల కొనుగోలు వంటివి లేచి టీడీపీకి కాస్త నష్టం చేకూర్చవచ్చు. వైసీపీ చూస్తే ఉన్న ఎమ్మెల్యేలనే కాపాడుకోలేక, బాబుపై పోరాడలేక విశ్వసనీయతను కోల్పోతోంది. జనసేన సంగతి చూస్తే విపరీతమైన రాజకీయ మార్పు, కొత్తదనం కోరుకుంటే తప్ప ఆదరణ దక్కని పరిస్థితి. ఈ లెక్కలన్నీ కలిపితే పవన్ అధికారంలోకి రాకపోయినా పొత్తుల వరకూ పరిస్థితి లాక్కురావచ్చని తేలుతోంది.