ప్రజాసంక్షేమమే ద్యేయం, ప్రజలకోసం ఏమి చేయడానికైనా సిద్దమే!

Thursday, August 16th, 2018, 10:40:35 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిన్న శ్రీకాకుళంలో జరిగిన 72 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వర్షం పడుతున్నప్పటికీ జండా ఎగురవేసి అయన వందనం చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం, ప్రజా సంక్షేమమే తన ద్యేయమని, ప్రజల కోసం ఎందాకైనా వెళ్ళడానికి సిద్ధమని అన్నారు. గాంధీమహాత్ముడు వంటి ఎందరో త్యాగధనుల ఫలితమే నేటి మన ఈ స్వతంత్ర భారతావని అని, వారి కలలను సాకారం చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ ద్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పెరిగిందని, ముఖ్యంగా విద్యరంగంలో మరింత అభివృద్ధి చేపట్టి యువత బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చూస్తామని అన్నారు. రాజధాని అమరావతిని దేశానికే తలమానికం అయ్యేలా తీర్చిదిద్దుతామని, అయితే దానికి కేంద్ర సాయం అవసరమని అన్నారు. మోడీ నిజంగా ఏపీ మీద మరియు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఉంటే ఈ పాటికి అమరావతిలో చాలా వరకు అభివృద్ధి దూసుకెళ్తుండేదని, అయినప్పటికీ తమ ప్రభుత్వం అభ్రివృద్ధి కార్యక్రమాలను మాత్రం ఆపడం జరగలేదై అన్నారు. సకాలంలో నిధులు అందివ్వకపోవడంవల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు దొరకలేదని అన్నారు.

హోదా మరియు విభజన హామీల విషయమై ఇప్పటికే మాట తప్పిన కేంద్రం వారు రాష్ట్రానికి ఊహించలేనంత నష్టాన్ని మిగిల్చారని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సఫలమైందని చెప్పుకొచ్చారు. వ్యక్తి పుట్టిన దగ్గరినుండి మరణించేవరకు ప్రభుత్వం పలు పథకాలతో వారికీ అండగా ఉంటూ వస్తోందని, ఇప్పటికేవరకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఆడబిడ్డలకు పెళ్లి కనుక, వృద్ధాప్య పించన్లు, చిన్నారులకు బాలామృతం మరియు గోరుముద్దలు, గర్భిణుల కోసం తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరియు స్కాలర్ షిప్స్, బాలికలకు సైకిళ్ళు, దివ్యంగులకు ట్రై సైకిళ్ళు, బిసిలకు రూ.10వేల కోట్లతో సబ్ ప్లాన్, బ్రాహ్మణులకు కార్పొరేషన్లు, కాపులకు రూ.1000 కోట్లతో కార్పొరేషన్ ఇక త్వరలో ప్రవేశ పెట్టనున్న నిరుద్యోగ భృతి వంటివి తమను ప్రజలకు మరింత చేరువ చేశాయని అన్నారు. అధికారం చేపట్టిన నాటినుడి ఇప్పటివరకు ప్రజల సంక్షేమమే ద్యేయంగా ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వం మిగిలి వున్న ఈ కొద్దికాలంలో కూడా మరింతగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు…..