నేరగాళ్లను వణికిస్తున్న కార్డన్ సెర్చ్

Tuesday, October 7th, 2014, 02:17:38 AM IST

police

శివారు ప్రాంతాల్లో తిష్ట వేసిన రౌడీ రాయుళ్లు రాత్రయితే చాలు భయంతో పారిపోతున్నారు. కార్డన్ సెర్చ్ పేరుతో పోలీసులు చేస్తున్న తనిఖీలతో నేరస్థులు భయంతో ఒణికిపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా నిందితులు వేస్తున్న ఎత్తులను పోలీసులు చిత్తు చేస్తున్నారు. రోజుకో ప్రాంతంలో పద్మవ్యూహం పన్ని.. ఖాకీలు నేరస్థుల ఆటకట్టిస్తున్నారు. ఇటీవల సెర్చ్ ఆపరేషన్ పేరుతో పోలీసులు చేస్తోన్న కార్డన్ సెర్చ్ అనేక ఫలితాలిస్తోంది.

పహాడీ షరీఫ్ లో స్నేక్ గ్యాంగ్ ను పట్టుకోవడానికీ… మొన్నామధ్య ఆల్వాల్ లో టెర్రరిస్ట్ లింకులు ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకోవడానికి నగర పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ హైదరాబాద్ పోలీసులకి కూడా కొత్తే… కానీ అంతర్జాతీయ పోలీసింగ్ వ్యవస్థలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ బాగా పాపులర్. దీన్ని విదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంచుకున్న నిర్దేశిత ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా దిగ్బంధనం చేసి జల్లెడ పట్టడమే ఈ కార్డన్ సెర్చ్.

ఏ ప్రాంతంలో నిందితులు ఉన్నారని అనుమానిస్తారో ఆ ప్రాంతాన్ని పూర్తిగా ట్రాక్ చేస్తారు. గుర్తించిన ప్రతీ మేజర్ రూట్ తో పాటు ప్రతీ చిన్న గల్లీని పోలీసులు నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేకుండా హఠాత్తుగా భారీ బలగంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముడతారు. ఈ క్రమంలోనే మనుషులు గానీ వాహనాలు గానీ నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు వెళ్లకుండా… దిగ్బంధనం చేసి… ఆ ఏరియాలోని ప్రతీ ఇంటినీ సెర్చ్ చేస్తారు. దీని వల్ల నిందితులు తప్పించుకునే అవకాశం ఉండదు.

వరల్డ్ క్లాస్ పోలీసింగ్ లో భాగంగా ఆగస్ట్ నెల నుంచి హైదరాబాద్ పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసులు మొత్తం ఐదుకు పైగా కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఆగస్ట్ ఆరంభంలో బాలానగర్ జోన్ లో మొదటి ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత శంషాబాద్ జోన్ లో ఓ సారి… ఆల్వాల్ ప్రాంతంలో మరోసారి ఈ నిర్వహించారు. కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తో పాటు ఇంటర్నేషనల్ పోలీసింగ్ లో కార్డాన్ అండ్ కిక్.. కార్డాన్ అండ్ నాక్ చాలా పాపులర్.

కార్డన్ సెర్చ్ తో స్థానికులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ నేరస్తుల ఆటకట్టించేందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. నగర పోలీసులు నిర్వహిస్తున్న ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఇప్పటికే వందల సంఖ్యలో నేరగాళ్లు. దుండగులు పట్టుబడగా పలు కీలక కేసులకు సంబందించి నిందితులు పోలీసులకు చిక్కారు.