ఇవి ఎన్నికలు.. బాలకృష్ణ సినిమా కాదట..!

Friday, January 29th, 2016, 12:21:23 PM IST

balakrishna
ప్రస్తుతం తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేడి విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో హడావుడి ఎక్కువైంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవడం షరా మామూలైపోయింది. ఇకపోతే, ఎన్నికలలోకి అవసరంలేని విషయాలను కూడా అనవసరంగా లాగుతున్నారు. గ్రేటర్ ఎన్నికలతో సంబంధంలేని, గ్రేటర్ లో ప్రచారం చేయని నటుడు, ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి నిజామాబాద్ ఎంపి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కూతురు కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇవి సందర్భానుసారం చమత్కరంగానే ఉన్నా, బాలయ్య అభిమానులు మాత్రం ఈ విషయంలో గుర్రుగానే ఉన్నారట. అసలు ఇంతకీ కవిత ఏమన్నది. అనే విషయం తెలుస్తుందాం.

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్లు ఏర్పాటు చేసిన ది ప్రెస్ అనే కార్యక్రమంలో ఎంపి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఇవి ఎన్నికలని.. ఇక్కడ సవాల్ చేయడాలు తొడగొట్టటాలు ఉండవని.. సవాల్ విసురుకోవడానికి.. తొడగొట్టడానికి ఇదేమైనా బాలకృష్ణ సినిమానా అని వ్యాఖ్యానించారు. ఇకపోతే, బాలకృష్ణ గురించి కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. అనవసరంగా బాలకృష్ణను ఈ విషయంలోకి లాగడం ఏమిటని బాలయ్య అభిమానులు ప్రశ్నిస్తున్నారు.