అఖిల్ కోసం యువహీరో త్యాగం!

Monday, August 31st, 2015, 01:40:45 PM IST

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ను హీరోగా శ్రేష్ట బ్యానర్ పై ప్రముఖ తెలుగు యువహీరో నితిన్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కినేని అఖిల్ తొలిసారి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హీరోగా పరిచయమైనా తొలినాళ్ళలోనే మంచి పేరును సంపాదించి, అనంతరం వరుస ఫ్లాప్ లను మూటగట్టుకుని, మరలా ఇటీవల కాలంలో తిరిగి ఫామ్ లోకి వచ్చిన నితిన్ కు అఖిల్ తొలి సినిమా నిర్మాతగా మారడం రిస్క్ స్టెప్ గానే చెప్పుకోవచ్చు.

ఇక నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అఖిల్ లాంచింగ్ మూవీ కావడం, భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడం వంటి అంశాల నేపధ్యంలో మరో సినిమాను ఒప్పుకోకుండా ఈ హీరో దగ్గరుండి నిర్మాణ బాధ్యతలను చూసుకుంటున్నాడట. అలాగే తను నటించే సినిమా కధ విషయంలోనూ, కాస్టింగ్ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్న నితిన్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. అయితే సమంత హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే అఖిల్ తో నిర్మిస్తున్న సినిమా బాధ్యతలను పూర్తిగా ముగించాలని నితిన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక నిర్మాతగా నిలదొక్కుకునేందుకు ఈ హీరో తన కెరీర్ లో సినిమాలను సైతం త్యాగం చేసి మూవీస్ మధ్య బాగా గ్యాప్ తీసుకుంటున్నాడని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.