కెనడాతో కీలక దౌత్యం ఫలించింది!

Thursday, April 16th, 2015, 09:26:55 AM IST

modi
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, జర్మనీల అనంతరం బుధవారం కెనడా చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీ ఆ దేశ ప్రధాని స్టీఫెన్ హార్పర్ తో అణు ఇంధనంతో సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం అణు విద్యుదుత్పత్తికి ముఖ్యమైన యురేనియంను ఐదేళ్ళ పాటు సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించి కీలక ఒప్పందాలు చేసింది. ఈ మేరకు ఈ సంవత్సరం మొదలుకొని ఐదేళ్ళపాటు కెనడా, భారత్ కు యురేనియంను అందించనుంది.

ఇక దీనిపై స్పందించిన ప్రధాని మోడీ అణు ఇంధన రంగంలో దశాబ్దాల అనంతరం ఇరుదేశాల మధ్య వాణిజ్య సహకారం మొదలైందని పేర్కొన్నారు. అలాగే తన పర్యటనలో కెనడాతో సంబంధాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయనే ఆశాభావాన్ని కెనడా పత్రిక ‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ లో రాసిన వ్యాసంలో మోడీ తెలిపారు. అదేవిధంగా ఇరు దేశాల మధ్య నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 13 ఒప్పందాలు కుదిరినట్టు మోడీ పేర్కొన్నారు. ఇక గత 42 ఏళ్ళలో కెనడాలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీనే కావడం విశేషం.