జ‌గ‌న్‌ని సీయం చేయ‌డానికి.. వైసీపీతో చేతులు క‌లిపిన‌.. చంద్రబాబు బంధువు..!

Thursday, February 28th, 2019, 01:21:23 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, రాష్ట్రా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే అధికార తెలుగుదేశం పార్టీని ప‌లువురు నేత‌లు వైసీపీలోకి జంప్ అవ‌డంతో టీడీపీలో క‌ల‌క‌లం రేపుతోంది.

మ‌రికొంత మంది టీడీపీ నేత‌లు, ఇత‌ర పార్టీ నేత‌లు వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. అంతే కాకుండా టీడీపీ నేత‌లే కాకుండా ఇత‌ర పార్టీ నేత‌లు, పారిశ్రామిక వేత్త‌లు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బంధువు, జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస‌రావు ఈరోజు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.

లోట‌స్‌పాండ్‌లో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, నార్నె శ్రీనివాస‌రావుకు వైసీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొద్దిరోజుల క్రితం నార్నె శ్రీనివాస‌రావు జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డంతోనే టీడీపీ శ్రేణులు ఉలిక్కిప‌డ్డాయి.

అయితే ఇప్పుడు ఏకంగా నార్నె శ్రీనివాస‌రావు వైసీపీలో చేర‌డం, ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి మామ కావ‌డంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మే అవుతోంది.

ఇక ఈ క్ర‌మంలో నార్నె శ్రీనివాస‌రావు మాట్లాడుతూ త‌ను టిక్కెట్ హామీతో వైసీపీలో చేర‌లేద‌ని, జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోసమే పార్టీలో చేరాన‌ని, పార్టీలో తాను ఎలాంటి స్థానాన్ని ఆశించ‌డంలేద‌ని నార్నె శ్రీనివాస‌రావు స్పష్టం చేశారు.