ఒబామాతో ‘మన్ కీ బాత్’ ప్రత్యేకం!

Thursday, January 22nd, 2015, 10:38:52 AM IST

modi
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మారుమూల పల్లెలకు సైతం తన సందేశం వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా గణతంత్ర్య దినోత్సవానికి ముఖ్య అతిధిగా భారత్ కు విచ్చేయనున్న నేపధ్యంలో ఒబామాతో కలిసి మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు మోడీ తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా ఐ ఉదయం సందేశాన్ని పోస్ట్ చేశారు.

మోడీ తన సందేశంలో ఒబామాతో కలిసి ఈ నెల 27న నిర్వహించనున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రత్యేకమైనదని అభిప్రాయపడ్డారు. కాగా అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఒబామాతో కలిసి ‘వాషింగ్టన్ పోస్ట్’ కు ఎడిట్ కాలమ్ రాసిన మోడీ, మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఒబామాను కోరారు. ఇక మోడీ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన ఒబామా తన అంగీకారాన్ని తెలియజేశారు.