జాతీయ జెండాకు మోడీ కొత్త భాష్యం!

Saturday, April 4th, 2015, 10:45:55 AM IST


భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ బెంగుళూరులో శుక్రవారం జరిగిన భాజపా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానేమి ఆకాశం నుండి ఊడిపడిన నాయకుడిని కాదని, రైతులు, గ్రామీణ ప్రజల మధ్య సాధారణ జీవితాన్ని గడిపి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. అలాగే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని, భారత్ ను ప్రపంచంలో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని మోడీ పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ రోజు ఐదెకరాలు ఉన్న రైతు పిల్లలకు బంట్రోతు ఉద్యోగానికి దాన్ని తెగనమ్మి లంచం ఇచ్చేందుకు సిద్దపడుతున్నాడని, అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామని తెలిపారు. అలాగే సరైన విద్య, పరిజ్ఞ్యానం లేకపోవడం వల్లనే వ్యవసాయం క్షీణదశకు చేరుకుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఇక రైతులను, వ్యవసాయాన్ని క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమని మోడీ వివరించారు. అలాగే కాషాయం విద్యుత్ శక్తికి ప్రతీకని, తెలుపు క్షీర విప్లవానికి సంకేతమని, ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి సూచన అంటూ మోడీ మువ్వన్నెల జెండాకు కొత్త భాష్యం చెప్పారు.