ఎమ్మెల్యే బాల‌కృష్ణ పీఏ సెటిల్‌మెంట్లు?

Tuesday, September 25th, 2018, 08:42:05 PM IST

తేదేపా నాయ‌కుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ పీఏ వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారా? అంటే అవున‌నే చిల‌మ‌త్తూరు తేదేపా నాయ‌కులు ఆరోపించారు. స‌ద‌రు పీఏ వీర‌య్య‌ గ్రూపు రాజ‌కీయాలు చేస్తూ త‌మ‌ను వేధిస్తున్నారంటూ ర‌చ్చ‌కెక్క‌డం సంచ‌ల‌న‌మైంది. తేదేపా నాయ‌కులు, మాజీ సర్పంచ్‌ నారాయణ, మండల మాజీ కన్వీనర్‌ బాబురెడ్డి, శెట్టిపల్లి ఎంపీటీసీ సభ్యుడు ప్రవీణ్, రామచంద్రారెడ్డి, మధుశేఖర్‌రెడ్డి చిల‌మ‌త్తూరు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మ‌రీ ఆవేద‌న వెల్ల‌గ‌క్క‌డం తెలుగు త‌మ్ముళ్ల‌లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ క‌న్వీన‌రే పీఏ వీర‌య్య న‌డిపిస్తున్న ఇన్న‌ర్ పాలిటిక్స్‌పై వాపోతే ఇక కార్య‌క‌ర్త‌ల‌కు ఎవ‌రు దిక్కు? అన్న వాద‌నా వినిపించారు.

వీరయ్య తనకు అనుకూలుడైన‌ రంగారెడ్డిని కన్వీనర్‌గా ప్రకటించి పెత్తనం చెలాయిస్తున్నారని, 2014లో పంచాయతీ ఎన్నికల వేళ‌ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ గెలుపుతో రంగారెడ్డి ప‌నిత‌నం లేనేలేద‌ని, అస‌లు ఆయ‌న ఉన్నా ప‌ని చేయకుండా వేరొక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలికాడని తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. తేదేపా ద్రోహి వీర‌య్య‌కు మండ‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డ‌మేంటి? అంటూ ప్ర‌శ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా రుణాల మంజూరులోనే అర్హులకు అన్యాయం చేస్తున్నాడ‌ని, ప్రజాప్రతినిధులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించుకుని పంచాయితీలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నాడ‌ని దుమ్మెత్తిపోశారు. పీఏ వీరయ్య అడ్డ‌గోలు వ్య‌వ‌హారంపై బాలయ్యకు ఫిర్యాదు చేయనున్నట్లు తేదేపా బాధిత నాయ‌కులు తెలిపారు.