సమీక్ష : ‘ఆగడు’ మహేష్ బాబు వన్ మాన్ షో

Friday, September 19th, 2014, 12:20:43 PM IST
aagadu-movie-review విడుదల తేదీ : 19 సెప్టెంబర్ 2014
నేటిఎపి. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : శ్రీను వైట్ల
నిర్మాత : అనిల్ సుంకర – రామ్ ఆచంట – గోపి ఆచంట
సంగీతం : ఎస్ఎస్ తమన్
నటీనటులు : మహేష్ బాబు, తమన్నా

‘దూకుడు’ వంటి భారి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఆగడు’. అభిమానులలో భారి అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్ లలో విడుదలయింది. ‘1 నేనొక్కడినే’తో ప్రయోగం చేసిన మహేష్ ఈసారి మాస్ ప్రేక్షకులని మెప్పించడమే లక్ష్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు’ చేశాడు. ఆ లక్ష్యం నెరవేరిందా..? అభిమానుల అంచనాలను ‘ఆగడు’ అందుకుందా..? లేదా..? తెలియాలంటే ఈ సమీక్ష ఒకసారి చదవండి.

కథ :

ముక్కపట్నంలో దామోదర్ (సోను సూద్), అతని తమ్ముడు మరియు అనుచరులు అరాచకాలు పెరిగిపోతాయి. పోలీసులు తమ డ్యూటీ చేయడానికి భయపడి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కోరతారు. దామోదర్ కు సరైన మొగుడు ‘దూకుడు’ మీదున్న పోలీస్ శంకర్ అని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తారు. ఆ ఏరియాకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్ ను సిఐగా నియమిస్తారు.

సిఐగా ముక్కపట్నం చేరిన ఎన్కౌంటర్ శంకర్ దామోదర్ ఆటలను ఎలా అరికట్టాడు..? దామోదర్ శంకర్ కుటుంబానికి చేసిన అన్యాయం ఏంటి..? వాటికి శంకర్ ఎలా పగ తీర్చుకున్నాడు..? తండ్రికి దూరమైన శంకర్ చివరికి ఆయన్ను చేరుకున్నాడా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా ఆసాంతం తన భుజాలపై నడిపించాడు. తర్వాతే తమన్నా, శృతి హాసన్, ఇతర కమెడియన్లు ఎవరైనా. ప్రతి సినిమాలో నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. క్యారెక్టర్ ఎలాంటిదైనా తనదైన మేనరిజమ్స్, నటనతో సినిమాకి బ్యాక్ బోన్ గా నిలుస్తున్నాడు. ‘ఆగడు’ సినిమాకి కూడా మహేష్ బాబు తన పెర్ఫార్మన్స్ తో కొత్త ఫీల్ తీసుకొచ్చాడు. ‘ఖలేజా’, ‘దూకుడు’ సినిమాలలో కామెడీ ఇరగదీసిన మహేష్… ‘ఆగడు’లో చెలరేగిపోయాడు. కామెడీలో న్యూ యాంగిల్ చూపించాడు. కోనసీమ యాసలో మహేష్ చెప్పిన డైలాగులు అభిమానులను అలరిస్తాయి. పోలీస్ పాత్రకు అతని ఫిజిక్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ఎన్కౌంటర్ శంకర్ పాత్రలో యాక్షన్ సన్నివేశాలలో చాలా స్టైలిష్ గా నటించాడు. డాన్సులు చేశాడు. ‘ఆగడు’లో అభిమానులు కొత్త మహేష్ బాబును చూస్తారు.

ఇక తమన్నా ఎప్పటిలా తన అందంతో ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలు అయినా మహేష్ బాబు పక్కన సరోజ పాత్రలో రొమాంటిక్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. పాటల్లో చాలా అందంగా కనిపించింది. ప్రత్యేక గీతంలో సందడి చేసిన శృతి హాసన్ థియేటర్ లో సెగలు రేపింది. జంక్షన్ లో పాటను శృతి స్వయంగా పాడడంతో ఆమె డాన్సు చేసేటప్పుడు ఆ కంఫర్ట్ లెవెల్స్ తెరపై కనపడుతుంది.

సరోజ స్వీట్స్ యాడ్స్ కాన్సెప్ట్ ధియేటర్ లో నవ్వులు పూయించింది. హీరో మీద నాజర్ వేసే సెటైర్ లు బాగా పేలాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ శీను, రఘుబాబు, పోసాని కృష్ణ మురళిల కామెడీ సీక్వెన్స్, ఎమ్మెస్ నారాయణ నటించిన సన్నివేశాలు కామెడీని బాగా పండించాయి. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కనిపించినవి రెండు సన్నివేశాలు అయినా వారి స్థాయి నటన కనబరిచారు.

మైనస్ పాయింట్స్ :

ప్రతి సినిమాకి శ్రీను వైట్ల ఒక విమర్శను ఎదుర్కుంటున్నారు. హీరో క్యారెక్టర్ మరియు కామెడీ సన్నివేశాల మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టడం లేదు అని. ఈ సినిమాకి కూడా అదే విమర్శ ఎదురయింది. ‘ఆగడు’ కథ సినిమాకి ప్రధాన అడ్డంకిగా మారింది. శ్రీను వైట్ల తన మార్క్ కమర్షియల్ ఫార్ములా కథను ‘ఆగడు’కి ఫాలో అయిపోయారు. కథ, కథనంలో ఇసుమంతైనా కొత్తదనం లేదు. ఇంటర్వెల్ తర్వాత సగటు ప్రేక్షకుడు మిగతా సినిమా ఏంటి అనేది అవలీలగా ఊహించగలరు. సినిమాలో ఉన్న ఒక్క ట్విస్టు రివీల్ అయిన తర్వాత సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. మరో ‘దూకుడు’ అనిపిస్తుంది.

శ్రీను వైట్ల ప్రతి సినిమాలో కీ రోల్ ప్లే చేసే ఆస్థాన కమెడియన్ బ్రహ్మానందం ఢిల్లీ సూరి పాత్రలో ‘ఆగడు’లో కథను నడిపించే ముఖ్య పాత్రలో నటించాడు. మహేష్ బాబు, బ్రహ్మి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు అనుకున్న రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్ లో ‘దూకుడు’ తరహాలో బ్రాహ్మి ఇతర హీరోలను అనుకరిస్తూ చేసిన డాన్సు, పేరడీ సాంగ్స్ నవ్వించకపోగా, సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగించింది. సోను సూద్ తన నటనతో ఆకట్టుకున్నా అతని పాత్రకు చెప్పిన డబ్బింగ్ సూట్ అవ్వలేదు. ప్రభాస్ శీను, రఘుబాబు, పోసాని కృష్ణ మురళిల కామెడీ సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ కలిగింది.

సాంకేతిక విభాగం :

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ప్రతి ఫ్రేమ్ ను చాలా అందంగా తీర్చిదిద్దారు. హీరో హీరోయిన్లను అందంగా చూపించారు. ఆజా సరోజ పాటలో ఎడిటర్ తప్పిదాల వల్ల పిక్చర్ క్లారిటీ మిస్ అయ్యింది. మిగతా అన్ని పాటల్లో వచ్చే లొకేషన్లను చాలా అందంగా తెరకెక్కించారు. వాటికి ప్రేమ్ రక్షిత్ అందించిన కొరియోగ్రఫీ ఇంకా బాగుంది. తమన్ స్వరపరిచిన పాటల్లో టైటిల్ సాంగ్, జంక్షన్ లో.., భెల్ పూరి.., పాటలు బాగున్నాయి. వాటిని తెరపై ఇంకా అందంగా చిత్రీకరించారు. రీ రికార్డింగ్ కొన్నిసన్నివేశాలలో బాగుంది, మరికొన్ని సన్నివేశాలలో రీ రికార్డింగ్ ఇతర సినిమాలను గుర్తుకు తెచ్చింది. సినిమా నిడివి ఎక్కువైంది. ఎడిటర్ వర్మ అనవసరమైన సన్నివేశాలను చాలా కత్తిరించి ఉంటె బాగుండేది.

కొత్త రచయితలపై పంచ్ డైలాగుల ప్రభావం చాలా ఉంది. ప్రతి మాటలో ప్రాస కోసం ప్రయత్నించి ఆయసపడ్డారు. మహేష్ బాబు చెప్పిన పిట్ట కథలు ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. డైలాగులు స్పీడుగా చెప్పడం వలన కొందరికి అర్ధం కాలేదు. పైన తెలియజేసిన విధంగా శ్రీను వైట్ల హీరో స్టైలింగ్, టేకింగ్ పరంగా అత్యుత్తమ పనితీరు కనబరిచారు. కథ, కథనాలపై మరింత శ్రద్ధ వహించకపోతే కష్టం. హీరోలను మారుస్తూ ఒకే కథతో సినిమాలు తీయడం అలవాటు చేసుకున్న శ్రీను వైట్ల తన పంధాను మార్చుకుంటే మంచిది.

తీర్పు :

‘1 నేనొక్కడినే’తో డీలా పడిన మహేష్ బాబు మాస్ అభిమానులకు ‘ఆగడు’ కొంత రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ‘దూకుడు’ తరహా మాస్ కమర్షియల్ హిట్ సినిమా ఆశించిన అభిమానులకు నిరాశ తప్పదు. ‘దూకుడు’ కాంబినేషన్ లో భారి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా వాటిని చేరుకోలేకపోయింది. రొటీన్ కథ, అర్ధం పర్ధం లేని ప్రాసతో కూడిన పంచ్ డైలాగులు. ‘దూకుడు’ను తలపించే సెకండ్ హాఫ్ ‘ఆగడు’ను బ్లాక్ బస్టర్ మైలురాయికి చాలా దూరంలో ఆపేశాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ పెర్ఫార్మన్స్, అందాల ముద్దుగుమ్మలు తమన్నా, శృతి హాసన్ గ్లామర్ తళుకుబెళుకులు. కాస్త కామెడీ సినిమాను హిట్ చేశాయి.

నేటిఏపి.కామ్ రేటింగ్ : 3.25/5
నేటిఏపి టీం