అసెంబ్లీలో ‘కాగ్’ నివేదిక

Friday, June 21st, 2013, 12:40:04 PM IST

బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన టెండర్ల, కాంట్రాక్టుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని కాగ్ అభిప్రాయపడింది. జలయజ్ఞం, ఉపాధి హామీ పథకాల్లో లోపాలను నివేదిక వెల్లడించింది. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జలయజ్ఞం నిర్వహణలో ఈపీపీ తీరును కాగ్ నివేదిక తూర్పారబట్టింది. ప్రాజెక్టుల నిర్వాసితుల్లో 13 శాతం మందికి మాత్రమే ఇళ్లు నిర్మాణం పూర్తయిందని తెలిపింది. ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన అమలు రికార్డుల నిర్వహణ సరిగా లేదని అభిప్రాయపడింది.

కృష్ణా వరద జలాలపై ఆధారపడి చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల మనుగడ సాధ్యం కాకపోవచ్చని చెప్పింది. గాలేరు – నగరి, వెలిగొండ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ విషయంలో నీటి లభ్యత రుజువు చేయలేదని, దీని వల్ల కేంద్ర జలసంఘం ప్రతిపాదనలను తిప్పిపంపిందని తెలిపింది. 26 ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన నిర్దిష్ఠ పరిశీలనలను కాగ్ వెల్లడించింది. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం 52,116 కోట్ల మేర పెరిగిందని తెలిపింది.