రాష్ట్రాలకు కొత్త పీసీసీలు – వీరిద్దరేనా..?

Saturday, February 22nd, 2014, 03:10:21 PM IST

kanna-
విభజన నేపథ్యంలో అటు ప్రాంతం, ఇటు పార్టీ విషయంలో కాంగ్రెస్ ఎడతెరపని కసరత్తులు చేస్తోంది. తాజాగా సీమాంధ్ర – తెలంగాణ ప్రాంతాలకు కొత్త పీసీసీ అధ్యక్షులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కాకుండా ముఖ్యమంత్రిని నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తాజా సమాచారం. రాష్ట్ర విభజన సమస్య తీరిన తరువాత వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టేక్కాలని ఇప్పటి నుంచే కాంగ్రెస్ కసరత్తులు మొదలు పెట్టింది.

రెండు రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను నియమించాలని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్నా లక్ష్మీ నారాయణ, తెలంగాణ ప్రాంతానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచే డి.శ్రీనివాస్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు వినిపిస్తోంది. అంతేగాక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కన్నాను నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు మరో ప్రచారం..

కాపులను బీసీల్లో చేర్చాలని తాను సోనియాను కోరడం జరిగిందని.. అంతేకాని ఎలాంటి ఇతర అంశాలు చర్చకు రాలేదని కన్నా మీడియాతో చెప్పారు. కర్ణాటకలో చేసిన అమలు చేసిన ఫార్ములాను ఇక్కడ అమలు చేయాలని సోనియాను కన్నా కోరినట్లు సమాచారం. బీసీలకు ప్రోత్సాహం అందిస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుందని కన్నా చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన కిరణ్ కొత్త పార్టీ పెట్టినా ఆ పార్టీలోకి ఎవరు వెళ్లకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి మార్పులు చేస్తుందో అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.