సీఎం కిరణ్ మాస్టర్ ప్లాన్..!

Saturday, November 23rd, 2013, 11:04:45 PM IST

అసెంబ్లీ ప్రొరోగ్ చేయాలని స్పీకర్ ని కోరడం ద్వారా రాష్ట్ర విభజన ప్రక్రియ బంతిని తన కోర్టులోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు సీఎం కిరణ్. గతంలో స్పీకర్ గా పని చేసిన కిరణ్ ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని టీ బిల్లు ప్రక్రియని కొత్త ఇరకాటంలోకి నెట్టి వేశారు.

హై కమాండ్ ని ధిక్కరిస్తూ సమైక్య సమరం చేస్తున్న సీఎం కిరణ్, విభజన వ్యవహారంలో తన రాజకీయ అనుభవాన్నంతా రంగరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాల్సిందిగా స్పీకర్ కు నోట్ పంపించిన సీఎం దాని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ గీశారని విశ్లేషకులు చెబుతున్నారు. జులైలో వర్షాకాల సమావేశాల అనంతరం శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ఇప్పుడు ప్రొరోగ్ చేయడం ద్వార మళ్లీ సమావేశాల వరకు సభని సమావేశ పరిచే అవకాశం ఉండదు. ప్రొరోగ్ చేయకుండా ఉంటే ఒకవేళ తెలంగాణ బిల్లుకు సంబంధించి తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు…శాసన సభని సమావేశ పర్చే అవకాశం స్పీకర్ కు ఉంటుంది. అయితే తాజాగా అసెంబ్లీని ప్రొరోగ్ చేయమని సీఎం కోరడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. శాసన సభ ప్రొరోగ్ అయిపోతే మళ్లీ కేబినేట్ సమావేశం పెట్టి సీఎం ఎప్పుడు శాసనసభ నిర్వహించాలో చెప్పే వరకు రాష్ట్రపతికి కూడా సమావేశాలని నిర్వహించమనే అధికారం రాజ్యాంగ పరంగా లేదు. గతంలో స్పీకర్ గా చేసిన అనుభవంతో ఈ పాయింట్ ని అనుకూలంగా మార్చుకున్నారు సీఎం కిరణ్.

ఇప్పుడు స్పీకర్.. సీఎం ప్రొరోగ్ నోట్ ని ఆమోదించి గవర్నర్ కు పంపిస్తారా ? లేదా అన్నది కీలక అంశం. స్పీకర్ ఆమోదిస్తే టీ బిల్లుపై చర్చకు అవకాశం లేకుండా చేసినట్లవుతుంది. లేని పక్షంలో స్పీకర్ హై కమాండ్ ఒత్తిడికి తలొగ్గుతున్నారనే విమర్శ వస్తుంది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోతే ఎందుకు చేయలేదో చెప్పాల్సిన బాధ్యత కూడా స్పీకర్ పై ఉంటుంది. పలు కీలక ఆర్డినెన్స్ లు ఆగిపోతాయనే మెలిక పెట్టి స్పీకర్ ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు కిరణ్.

ఒకవేళ స్పీకర్ అసెంబ్లీని ప్రొరోగ్ చేసిన తర్వాత కేంద్రం కేబినెట్ పంపే ముసాయిదా బిల్లుని శాసనసభలో కిరణ్ ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హై కమాండ్ ఆదేశాలకు అనుగుణంగా కిరణ్ సమావేశాలని నిర్వహిస్తారా.. లేదా శాసన సభని నిర్వహించే విషయంలో మెలికపెడతారా అనే దానిపై చర్చ మొదలైంది. ఒకవేళ ముఖ్యమంత్రి అధిష్ఠానం ఆదేశాన్ని కాదంటే సీఎంని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆర్టికల్ 356ని ఇష్టానుసారంగా ఉపయోగించడానికి వీలులేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ ప్రకారం అధిష్ఠానం మాట వినలేదని కారణం చూపి సీఎంని తొలగించే అవకాశం లేదు. ఈ పరిణామాలన్నీ తనని అనుకూలంగా మార్చుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆర్టికల్ 371 డి వివాదంపై ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న కాంగ్రెస్ హై కమాండ్ కు ప్రొరోగ్ అంశంతో కిరణ్ వేసిన ఎత్తుగడని ఏ రకంగా హ్యాండిల్ చేయాలో పాలుపోవట్లేదు.

మొత్తం మీద తన అనుభవాన్ని, తనలోని లాజిక్కులని ఉపయోగిస్తూ విభజన బంతిని కిరణ్ తన కోర్టులోకి తెచ్చుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు