మొన్న మోడికి.. నిన్నకెసిఆర్ కు గుడికట్టేశారు..!

Thursday, February 18th, 2016, 11:52:47 AM IST


ఒక వ్యక్తిపై ఉన్న అభిమానం ఎటువంటి పనినైనా చేయిస్తుంది. ఇందుకు ఉదాహరణగా తమిళ ప్రజల గురించి ఎక్కువగా చెప్తారు. ఎందుకంటే.. తమిళనాడులో ఒక వ్యక్తిని ఆరాధించడం మొదలుపెట్టారు అంటే ఆ వ్యక్తికోసం ఎంతకైనా తెగిస్తారు. గుండు గీయించుకోవడం దగ్గరి నుంచి గుడి కట్టడం వరకు అన్ని చేస్తారు. సినిమా వాళ్ళకే కాదు అక్కడ రాజకీయ నాయకులకు వీరాభిమానులు ఉంటారు.

ఇక, రాజకీయాల విషయానికి వస్తే.. గతేడాది మోడికి గుజరాత్ లో అతని అభిమానులు గుడి కట్టారు. గుడి కట్టడమే కాదు.. అందులో మోడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేశారు. అయితే, మోడి కోపగించుకోవడంతో దాన్ని తొలగించేశారనుకోండి అది వేరే విషయం. ఇక, తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ సోనియా తెలంగాణా ఇచ్చిందని చెప్పి సోనియా విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆ విగ్రహానికి పూజలు పూజలు చేశారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీని ఏర్పాటు చేసి.. తెలంగాణ కోసం పోరాటం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో గుండ రవీందర్ అనే వ్యక్తి తన ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కెసిఆర్ కు గుడి కట్టాడు. అందులో కెసిఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. తెలంగాణ దేవుడు కెసిఆర్ అని అందుకే ఆయనకు గుడి కట్టినట్టు గుండ రవీందర్ పేర్కొన్నారు. ఇక, అటు అమరావతిలో చంద్రబాబుకు కూడా గుడి కట్టిన సంగతి విదితమే.