కేబీఆర్ పార్కు ఘటనపై ప్రముఖుల స్పందన

Wednesday, November 19th, 2014, 02:11:23 PM IST


అరబిందో ఫార్మా చైర్మన్ నిత్యానందరెడ్డిపై బుధవారం ఉదయం కేబీఆర్ పార్కులో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై స్పందించిన నిత్యానందరెడ్డి మాట్లాడుతూ తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని వివరించారు. అలాగే కాల్పులు జరిపిన ఆగంతకుడికి సుమారు 30ఏళ్ళ వయసు ఉంటుందని, తన వెనకాలే కారులోకి ఎక్కి ఏకే 47 గన్ తో గురిపెట్టాడని వివరించారు. కాగా ఘటనా స్థలం వద్ద పోలీసులకు ఎనిమిది బులెట్లు లభ్యమయ్యాయి. ఇక దీనిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా నిత్యానందరెడ్డిపై కాల్పుల సంగతి తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు పరామర్శించారు. ఇక దాడిపై సమాచారం అందిన వెంటనే జగన్ నిత్యానందరెడ్డికి ఫోన్ చేసి కాల్పులు జరిగిన తీరు, నిందితుడి వివరాలను కనుగొన్నారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో నిత్యానందరెడ్డి కూడా ఒక నిందితునిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే లాభాలు ఆశించే జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టాను తప్ప వైఎస్ఆర్ నుండి లబ్ధి పొందడం కోసం కాదని నిత్యానందరెడ్డి కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు.

ఇక కేబీఆర్ పార్కులో కాల్పులపై ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం తెలంగాణ అసెంబ్లీలో స్పందించారు. కాగా జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలపై గురువారం సభలో చర్చ పెట్టనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. అలాగే కాల్పుల ఘటనపై సభలో సవివరంగా ప్రకటన ఇస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు.