‘ఐఎస్ఐస్’ అసలు కధేమిటి

Thursday, November 19th, 2015, 11:02:35 PM IST

isis
ప్యారిస్ లో ఉగ్రదాడి తరువాత అగ్ర దేశం అమెరికాను భయపెడుతున్న సంస్థ ‘ఐఎస్ఐఎస్’. రోజురోజుకు ప్రపంచానికి ప్రమాదంలా పరిణమిస్తున్న ఈ సంస్థ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినది కాదు. ఎన్నో ఏళ్ల క్రితమే చిన్న మొక్కలా పుట్టి ప్రస్తుతం ప్రపంచానికే విషపు వృక్షంలా తయారైన ఈ సంస్థ 1999 ఇరాక్ లో ‘జమాత్ అల్-తాహీద్ అల్-జిహాద్’ అనే పేరుతో ప్రారంభమైంది. తరువాత ఉగ్రవాద సంస్థ ‘అల్ ఖైదా’ తో చేతులు కలిపి ‘అల ఖైదా ఇన్ ఇరాక్’ గా ఏర్పడింది.

ఆ తరువాత 2006లో కొన్ని సున్నీ తీవ్రవాద సంస్థలతో కలిసి ముజాహిదీన్ ఘరా కౌన్సిల్ గా మారింది. కొద్దికాలం తరువాత తన కొత్త పేరును ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకొని నెమ్మదిగా ‘ఇస్లామిక్ స్టేట్’ గా అవతరించింది. సిరియాలో అంతర్యుద్దం మొదలయ్యాక అక్కడి సున్నీ సంస్థల ప్రభావిత ప్రాంతాలను తన ఆదీనంలోకి తెచ్చుకుంది. 2013 ఏప్రిల్ లో సిరియాలోని అల్ ఖైదా సంబందిత సంస్థలను తనలో కలుపుకొని ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ గా అవతరించి విభేదాల కారణంగా అల్ ఖైదా నుండి విడిపోయి పూర్తి స్థాయి స్వతంత్ర్య సంస్థగా తయారైంది.

ప్రస్తుతం ఇందులో భారత్ తో పాటు మరో 100 దేశాలకు చెందిన 20,000 మంది సైనికులు సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఐఎస్ఐఎస్ వద్ద 13,000కోట్ల రూపాయల నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. సిరియాకు చమురు బావుల ద్వారా వస్తున్న ఆదాయం మొత్తం దాదాపు ఐఎస్ఐఎస్ కు చేరుతున్నట్టు సమాచారం.