నేటిఏపి విశ్లేషణ : తూర్పు ఎటో.. తీర్పు అటే..!

Saturday, May 17th, 2014, 03:45:21 PM IST


తెలంగాణ సెంటిమెంట్ లాగే.. సీమాంధ్రలోనూ సెంటిమెంట్ పనిచేస్తుందా..? ఇంతవరకు అధికారంలోకొచ్చిన పార్టీలు ఏయే ప్రాంతాల్ని బలంగా విశ్వసించాయి..? సెంటిమెంట్ నియోజకవర్గాలు కైవశమైతే అధికార పగ్గాలు చేజిక్కినట్టేనా..? ఆశ్చర్యం అనిపించినా… ఫలితాలు మాత్రం వాటికి బలాన్ని చేకూరుస్తున్నాయి.ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలు సాధించిన పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే సెంటిమెంటు కొత్త రాష్ట్రంలోనూ ప్రతిఫలించింది. ఈ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ పార్టీనే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.

గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ కు అండగా నిలిచిన ఉభయ గోదావరిపై.. టీడీపీ, వైసీపీ సీరియస్ గా దృష్టి సారించాయి. ఇక్కడ సెంటిమెంటు పనిచేస్తుండటంతో.. ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేశారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ముందు వరకూ ఇరు పక్షాల్లో ధీమా కనిపించింది. అధికారంలోకి వస్తామని ఒకరంటే కాదు కాదు.. మా పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ పోటాపోటీ ప్రకటనలు చేశారు. ఐతే మున్సిపల్, పరిషత్ ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగేలా చేశాయి. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ పునరావృతమైంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఇది నిరూపితమైందని ప్రచారముంది. సార్వత్రిక సమరంలోనూ అది కొనసాగింది.

తూర్పు ఎటో.. తీర్పు అటే అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. తూర్పుగోదావరి జిల్లా వాసులు ఏ పార్టీవైపు మొగ్గు చూపితే, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి రావడం కాకతాళీయంగా జరుగుతోంది. ౩ పార్లమెంటరీ, 19 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ భారీ జిల్లా ఈసారి తెలుగుదేశానికి పట్టం కట్టింది. ౩ ఎంపీ స్థానాలతో పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాలను కట్టబెట్టింది. ౫ చోట్ల మాత్రం వైసీపీ అభ్యర్థులు, పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థి, టీడీపీ రెబల్ విజయం సాధించారు.

పశ్చిమ గోదావరి జిల్లా పసుపుమయం అయ్యింది. ఇక్కడ సార్వత్రిక సమరం ఏకపక్షంగా సాగింది. ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీడీపీ-బీజేపీ కూటమి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోగా.. ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ పాగా వేసింది. వైసీపీ కొన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇవ్వగా.. కాంగ్రెస్, జేఎస్పీ మాత్రం పూర్తిగా చతికిలబడ్డాయి.