త్వరలో ఏపీలో యాత్ర చేపట్టనున్న కన్నా?

Friday, June 1st, 2018, 12:25:04 PM IST

రానున్న సార్వత్రిక ఎన్నికలకు రోజురోజుకు సమయం దగ్గర పడుతుండడంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు టీడీపీ పార్టీ ఇటీవల మహానాడు వంటి కార్యక్రమాలు, అలానే ధర్మపోరాట దీక్షలా వంటివి చేస్తూ ప్రజలతో చాలావరకు మమేకమవుతూ ముందుకు సాగుతోంది. ఇకపోతే వైసిపి అధినేత జగన్ అయితే ఏకంగా ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి ఇప్పటికే 2000 పైచిలుకు కిలోమీటర్లు యాత్ర చేసి, ఇంకా కొనసాగిస్తూనే వున్నారు. మరొకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీ రానున్న ఎన్నికల్లో దాదాపు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, దానికోసం ముందుగా ప్రజాసమస్యలపై తనకు, పార్టీ కార్యకర్తలకు అవగాహన కలిగివుండాలనే ఉద్దేశంతో ప్రజా పోరాట యాత్ర పేరుతో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది బిజెపి వంతు అని చెప్పక తప్పదు.

వాస్తవానికి బిజెపి కూడా ఈసారి ఏపీ పై గట్టిగ ఫోకస్ చేసిందని చెప్పుకోవాలి, తమ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టిన బిజెపి ఇక్కడ ఏపీ రాజకీయాలపై మంచి పట్టున్న కన్నాలక్ష్మి నారాయణను తమ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే కన్నా ఇటీవల మాట్లాడుతూ చంద్రబాబు బిజెపి నుండి పొందవలసిన లాభాలన్నీ పొంది, ఇప్పుడు అనవసరంగా నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాక చంద్రబాబు ఢిల్లీ ఎన్నో సార్లు వెళ్ళమని చెపుతున్నారు కదా, ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా జగన్ జైలుకి ఎప్పుడు వెళతారు, ఏపీలో అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెచుతారు అనేవాటిమీద ధ్యాసే తప్ప, నిజంగా ఏపీ అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు ఆలోచించలేదని వ్యాఖ్యానించారు.

ఇక ప్రస్తుతం బిజెపి కూడా ప్రజల్లోకి వెళ్లి మోడీ, బీజేపీల పాలన గురించి, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ చేపట్టదలచిన కార్యక్రమాల గురించి, టీడీపీ తమ పార్టీపై చేస్తున్న నిందారోపణలు గురించి గట్టిగా ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించారట. ఈ మేరకు కన్నాలక్ష్మి నారాయణతో కొద్దిరోజుల్లో రాష్ట్ర పర్యటనలు చేయించనున్నట్లు సమాచారం అందుతోంది. దీనివల్ల ప్రజలకు మరింతగా చేరువవ్వొచ్చని, ప్రస్తుత అధికారపార్టీ పాలనలో లోపాలు, ఒకవేళ తాము అధికారం చేపడితే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ప్రజలకు సుస్థిర పాలన అందించాలి అనే విధంగా దృష్టిపెట్టారట. కాబట్టి కన్నా చేపట్టనున్న ఈ యాత్ర ఏపీలోని బిజెపి నేతల్లో, కార్యకర్తల్లో నూతనోత్సాహాలు నింపగలదని ఆ భావిస్తున్నారు. ఇప్పటికే యాత్ర ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయని, ఇక ఆయన యాత్ర విశేషాలను త్వరలోనే మీడియా ముఖంగా ఒక ప్రకటన ద్వారా తెలియచేయనున్నారట…..