రెచ్చిపోయిన ‘సైకో’ చచ్చిపోయాడు

Tuesday, December 22nd, 2015, 04:45:47 PM IST

ఈ మధ్య మనుషులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావటం లేదు. అనేక కారణాల రీత్యా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే కొందరు సైకోలుగా మారి సమాజాన్ని భయపెడుతున్నారు. వీళ్ళలో కొందరు కొద్ది సేపే సైకోలుగా ప్రవర్తిస్తే మరికొందరు పూర్తి సైకోలుగా మారిపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా కమాన్ సెంటర్లోని లక్ష్మీ నగర్ నివాసి అయిన బల్విందర్ సింగ్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే సొంతూరికి వచ్చిన బల్విందర్ మంగళవారం ఉదయం ఇంట్లోని తల్లిదండ్రులతో గొడవపడి వాళ్ళను కత్తితో పొడిచి అదే కత్తితో బయటకొచ్చాడు. బయట కనిపించిన వారందరినీ ఆ కత్తితో గాయపరిచాడు. ఇతని దాడిలో దాదాపు 20మంది గాయపడగా అందులో పోలీసులు కూడా ఉన్నారు.

పోలీసులను చూసి కూడా బల్విందర్ ఆగకపోగా వారిపైకే దాడికి దిగటంతో స్థానిక సిఐ విజయపార్థ సారథి తప్పని పరిస్థితిలో తన సర్వీస్ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బల్విందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అసలు చక్కగా ఉద్యోగం చేసుకునే బల్విందర్ సైకోగా ఎందుకు మారాడన్నది తెలియరాలేదు.