హిట్టా లేక ఫట్టా : నా పేరు సూర్య – పర్వాలేదనిపించిన సూర్య…..

Friday, May 4th, 2018, 06:52:50 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం నాపేరు సూర్య. నేడు మంచి అంచనాలతో విడుదలయిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను సంపాదించింది. ఆవేశపరుడైన సోల్జర్ సూర్య, ఎలాగైనా దేశంకోసం బోర్డర్ లోయుద్ధం చేసి ఎప్పటికైనా యుద్ధంలోనే చనిపోవాలి అనుకుంటాడు. అయితే అతనికున్న ఆవేశం, కోపం కారణంగా అతన్ని ఆర్మీ నుండి తొలగిస్తారు. తిరిగి తాను ఆర్మీ లో చేరాలన్నా, మళ్లి బోర్డర్ లోకి రావాలన్నా ఇండియాలో ప్రముఖుడైన సైకియాట్రిస్ట్ రామకృష్ణంరాజు చేత అన్నింటా తాను ఫిట్ గా ఉన్నట్లు సెర్టిఫికెట్ తీసుకురమ్మని ఆర్మీ చీఫ్ సూర్యని ఆదేశిస్తాడు. అయితే వాస్తవానికి సూర్యకి తండ్రి అయిన రామకృష్ణంరాజు కొడుకుని ఎలా మార్చాడు,

వారిద్దరి అనుభవాలు ఏంటి, అందరూ అనుకున్నట్లుగా మారిన సూర్య ఏమి కోల్పోయాడు అనేదే చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రానికి ప్రధాన బలం హీరో అల్లు అర్జున్. ఒక నిజమైన సోల్జర్ కు ఉండవలసిన అన్ని లక్షణాలు ఈ సినిమాలో సూర్య పాత్రకు ఉంటాయి. కోపం, ఆవేశం, వృత్తి పట్ల గౌరవం, నడక, ప్రవర్తించే తీరు, ప్రేమ. ఇలా చెప్పుకుంటూపోతే అల్లు అర్జున్ ఈ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసారని చెప్పాలి. అంతే కాదు ఆయన పాత్ర కొన్నాళ్ల పాటు మన మనసులో నిలిచిపోతుంది. నిజానికి శత్రువులు ఎక్కడినుండో పుట్టరు, మన దేశంలోనే అదికూడా మనం చేసే తప్పులనుండే పుడతారు అని కథలో లీనమైన అంశం బాగుంది. ఇక వంశీ ఇదివరకు కథ అందించిన కిక్, టెంపర్ మాదిరి ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ కూడా మంచి రేసీ స్క్రీన్ ప్లే తో నడుస్తుంది.

మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశంలో హీరో తాను జీవితంలో ఏమి కోల్పోతున్నానో తెలుసుకునే అంశం బాగుంది. ఇక అల్లు అర్జున్ తన అభిమానులకోసం ఈ చిత్రంలో మంచి డాన్స్ లు ప్రదర్శించారు. ముఖ్యంగా ఆయన చేసిన క్యాప్ ట్రిక్ బాగా వర్క్ అవుట్ అయింది. ఇంటర్వెల్ సమయానికి హీరో తనని తాను మార్చుకుని ఎలాగైనా చివరికి సరిహద్దుకు చేరాలి అనుకునే విధానం బాగున్నప్పటికీ, ద్వితీయార్థంలో దానిని స్క్రీన్ మీద దర్శకుడు సరిగా చూపించలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో స్టోరీ వేరే ట్రాక్ కు మళ్లడం, అదికూడా ప్రేక్షకుడిని పెద్దగా ఆకట్టుకునేలా తీయలేకపోవడం అతి పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. ఏదైనా ప్రేక్షకుడు అనుకున్నదానికంటే వేరేగా కథని చెప్పాలనుకున్నపుడు అది వాళ్ళు అనుకున్నదానికంటే గొప్పగా వుంటుందా, లేదా అనేవిషయమై దర్శకుడు శ్రద్ధ పెట్టాలి. ఈ విషయంలో వంశి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

ముఖ్యంగా కామెడీ, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఆకట్టుకునే సాంగ్స్ వంటి అంశాలు లేకపోవడం, విలన్ కు పెద్దగా బలం లేకపోవడం, హీరోయిన్ పాత్రకు పెద్దగా గుర్తింపులేకుండా అలా వచ్చి ఇలా వెళ్తూ ఉండడం వంటివి ఈ చిత్రానికి పెద్ద మైనస్. ఏది ఏమైనా లక్ష్యం కోసం చేసే ప్రయాణంలో వ్యక్తిత్వాన్ని వదిలేసి, కష్టపడి గమ్యం చేరుకున్నా ప్రయోజనం లేనివిధంగా వుంది ఈ చిత్రం. మొత్తంగా చూస్తే పర్వాలేదనిపించే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ హైలైట్. అలానే దేశభక్తిని చూపించే మంచి సందేశం బాగుంది. పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేని సెకండ్ హాఫ్ లోని సన్నివేశాలు, బోర్ కొట్టే కథనం, పాటలు ఆకట్టుకోలేకపోవడం వంటివి ఈ చిత్రంలో లోపాలు. మొత్తంగా చూస్తే సూర్య టికెట్ కొన్న ప్రేక్షకులను ఒకింత సంతృప్తి పరుస్తాడనే చెప్పవచ్చు……

నా పేరు సూర్య – కొత్త బన్నీ కనిపిస్తాడు

Reviewed By 123telugu.com |Rating :3/5

ప్రభావం చూపలేక పోయాడు

Reviewed By greatandhra.com |Rating : 2.75/5

సూర్య అదరగొట్టాడు, కానీ స్క్రిప్ట్ బెదరగొట్టింది

Reviewed By gulte.com |Rating :2.75/5

ఇంకొంచెం బాగా తీయాలి

Reviewed By chitramala.in |Rating :3/5