రెండు ప్రభుత్వాల నుండి నిధులు కోరతాం – జీహెచ్ఎంసీ

Wednesday, February 26th, 2014, 11:12:00 AM IST


రాష్ట్ర విభజన దృష్ట్య హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)కి డబుల్ ధమాకా ఆఫర్ తగిలింది. రాష్ట్ర విభజన దృష్ట్య రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసిని కూడా ఉమ్మడిగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీనితో రెండు రాష్ట్రాల నుండి జీహెచ్ఎంసీకి నిధులు రానున్నాయి. అయితే నగరంలోని అన్ని సదుపాయాలను పది సంవత్సరాల వరకు రెండు ప్రభుత్వాలు ఉపయోగించుకుంటాయి. కానుక తమపై అదనపు బారం పడుతుందని కావున తాము రెండు ప్రభుత్వాల నుండి గ్రాంటులు, నిధులను కోరతామని మేయర్ మాజీద్ హుస్సేన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మొత్తం 150 వార్డులు అభివృద్ధి చేయాలి. వాటి అభివృద్దికి ఒక్కో వార్డుకు కోటిన్నర రూపాయలు, వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలను అభివృద్ధి పరచడానికి రెండు కోట్లవరకు ఖర్చు అవుతుందని కావున జీహెచ్ఎంసికి తప్పని సరిగా నిధుల కొరత ఏర్పడుతుందని అన్నాడు. అందుకే రెండు ప్రాంతాల ప్రభుత్వాల నుండి నిధులను తీసుకుంటామని ఆయన తెలియజేశారు.