ఢిల్లీలో తొలి ఎబోలా కేసు

Wednesday, November 19th, 2014, 10:28:44 AM IST


ఢిల్లీ విమానాశ్రయంలో ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వ్యాధి సోకిన వ్యక్తిని తాజాగా గుర్తించారు. భారత సంతతికి చెందిన సదరు వ్యక్తిలో ఎబోలా వ్యాధికి చెందిన సూచనలు ఉండడంతో అతనిని విమానాశ్రయం ఆసుపత్రి ఐసోలేటెడ్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా లైబీరియా నుండి వచ్చిన ఆ వ్యక్తి శరీరంలో ఎబోలా వైరస్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే అక్కడి ఐసోలేటేడ్ వార్డుకు తరలించారు.

అయితే ఢిల్లీ విమానాశ్రయంలో గుర్తింపబడిన సదరు వ్యక్తి తనకు లైబీరియాలోఎబోలా వ్యాధి మూలంగా చికిత్స చేయబడినదని, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు తెలిపాడు. కాగా దీనిపై స్పందించిన ఒక అధికారి మాట్లాడుతూ ఇది ఎబోలా కేసు కాదని, ఎబోలా సోకి ట్రీట్మెంట్ తీసుకున్న కేసని, అతని రక్తంలో ఎబోలా నెగటివ్ ఉందని అయితే శరీర ద్రవాలలో పాజిటివ్ గా ఉన్నట్లు కనుగొన్నామని తెలిపారు. ఇక ఏదైనప్పటికీ అధిక జనాభా కలిగిన భారత దేశంలో వైరస్ లు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉండడం చేత అతనిని విమానాశ్రయం ఆసుపత్రి ఐసోలేటెడ్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో తొలి ఎబోలా కేసును గుర్తించడంతో భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలలో వైద్య పరీక్షలను ముమ్మరం చేశారు.