నోర్మూసుకోమన్న అరుణ.. దాదాగిరి వద్దన్న కేటిఅర్!

Tuesday, March 10th, 2015, 11:16:37 AM IST


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు అధికార, విపక్ష నేతల వాగ్యుద్ధంతో రసవత్తరంగా మారాయి. కాగా సభలో మాజీ మంత్రి డీకే అరుణ గుర్రం గడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రశ్నకు తెలంగాణ మంత్రి కేటిఅర్ సమాధానం ఇచ్చిన తర్వాత మరలా అరుణ ప్రసంగిస్తున్న సమయంలో తెరాస నేత విద్యాసాగర్ రావు మధ్యలో అడ్డుకున్నారు. ఇక దీనితో ఉగ్రరూపం దాల్చిన అరుణ ‘ఏం మాట్లాడుతున్నావు? ఏ పనులు చెయ్యోద్దంటావా? నోర్మూసుకుని కూర్చో… మధ్యలో వచ్చి ఏం మాట్లాడతావు? మహిళలంటే ఎట్లనో గౌరవం లేదు.. మీరు ఆ అంటే మేము నోరుమూసుకోవాల్నా? మహిళల నోరు ఎట్లనో మూపించారు… మంత్రివర్గంలో ఒక్క మహిళకైనా స్థానం లేదు’ అంటూ ధ్వజమెత్తారు.

ఈ వ్యాఖ్యలకు తిరిగి తెలంగాణ మంత్రి కేటిఅర్ సమాధానమిస్తూ గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వారు సభలో హుందాగా ఉండాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, అన్ పార్లమెంటరీ వర్డ్స్ మాట్లడవద్దంటూ హితవు పలికారు. అలాగే ఏ మహిళ పైనా తాము కేసులు పెట్టలేదని మంత్రి స్పష్టం చేశారు. ఇక ‘దాదాగిరి వద్దమ్మా.. క్యాంపు రాజకీయాలు ఇక్కడ చెయ్యొద్దు.. అవి ఇక్కడ చెల్లవు’ అంటూ కాంగ్రెస్ నేతలకు కేటిఅర్ చురక అంటించారు.