ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మరిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఐటీ గ్రిడ్ కేసు పై తెలంగాణ ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఏపీ సర్కార్ డేటా చోరీ అంశంపై రెండు సిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
డేటా చోరీ కేసు వ్యవహారంలో విచారణ జరిపేందుకు ఐపీఎస్ అధికారి బాలకృష్ణ నేతృత్వంలో ఒక సిట్‌ను, ఫారం-7 దుర్వినియోగం పై సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో మరో సిట్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడం ఖాయమని తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణ సిట్, మరోవైపు ఆంధ్రప్రదేశ్ సిట్ల మధ్య పోరు ఎలా ఉంటుందో అని సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఏపీ సేవామిత్ర యాప్‌లో తెలంగాణ డేటా ఉందని ఆ రాష్ట్ర సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డేటా చోరీ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన పూర్తి విచారణను తెలుసుకున్నామని త్వరలోనే ఈ కేసు విచారణ పూర్తి చేసి అసలు నిజాలు బయటపెడతామని, ఇప్పటికే సీజ్ చేసిన కంప్యూటర్లలో కొంత డేటాను కనుగొన్నామని, అయితే ఈ డేటా వారికి ఎలా వచ్చిందో విచారిస్తున్నామని సిట్ అధికారి తెలిపారు.