వ్యూహం.. ప్రతివ్యుహం.. అంతు చిక్కని రాజకీయం..!

Saturday, February 13th, 2016, 10:46:26 AM IST

trs-and-ap
సాధారణంగా ఎన్నికలకు ముందు రాజకీయాలలో వేడి పెరుగుతుంది. ఎన్నికలు పూర్తయ్యాక.. ఎప్పుడో ఒకరో ఇద్దరు పార్టీ ఫిరాయిస్తుంటారు. గెలిచిన పార్టీలోకి ఓడిన పార్టీనేతలు ఫిరాయించడం మనం చూస్తూనే ఉంటాం. కాని, తెలుగు రాష్ట్రాలలో ఆ పరిస్థితిలేదు. ముఖ్యంగా తెలంగాణలో.. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీకి చెందిన 10 ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇరకాటంలో పడింది.

అసలు తెలుగుదేశం పార్టీ నుంచే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు.. దీనిపై తెలుగుదేశం పార్టీ సమీక్షను నిర్వహించింది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే.. తప్పకుండా తెలంగాణ నుంచి రెడ్డి సామాజిక వర్గం తరపున తాను ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి గతంలో పెర్కొన్నారు. దీంతో వెలమవర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కోపం వచ్చింది. రేవంత్ వలనే తాము పార్టీ మారవలసి వచ్చిందని ఎర్రబెల్లి పేర్కొనడం విశేషం.

ఇకపోతే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నాడు. పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు అన్ని రకాలుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీకి తాను అండగా ఉంటానని చెప్పారు. ఇక, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిని టిడిఎల్పీ లీడర్ గా ప్రకటించారు. మరోవైపు తమదే నిజమైన టిడిఎల్పీ అని.. దానిని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామని అంటూ ఎర్రబెల్లి స్పీకర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే, తెలంగాణలో బలం కోల్పోతున్న తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో బలం పుంజుకోవాలని చూస్తున్నది. ఎలాగైనా బలం పెంచుకొని అక్కడ స్ట్రాంగ్ కావాలని అనుకుంటున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న, వైకాపా నేతలను ఆకర్షించాలని చూస్తున్నది. ఇక 8 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారం చేసింది. అంతేకాకుండా వారిలో కొంతమంది పేర్లను కూడా తెలుగుదేశం పార్టీ నేతలు బయటపెట్టడంతో.. అటు వైకాపా పార్టీ అప్రమత్తమయింది. ఎలాగైనా పార్టీ నాయకులను కాపాడుకోవాలని చూసింది.

ఇక, శుక్రవారం రోజున రోజా ప్రెస్ మీట్ నిర్వహించి, బాబును ఏకిపారేసింది. రాక్షసులే బాబు పార్టీలో చేరుతారని చెప్పింది. తమపార్టీ నుంచి ఎవరు పసుపు పార్టీలో చేరడంలేదని చెప్పుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ వైకాపా నాయకులు చేరతారని ప్రకటించిన కాసేపటికి ఆయా నేతలు తమ పార్టీ నాయకుడు జగన్ ను కలిసి.. తాము వైకాపాలోనే ఉంటామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అలా ఎందుకు ప్రచారం చేస్తున్నదో.. నేతలు అలా ఎందుకు చెప్తున్నారో అర్ధం కావాలంటే.. మరికొన్ని రోజులు పడుతుంది.