రాజధాని రైతులు కోరుకున్నట్టే.. జరుగుతుందా..?

Thursday, November 19th, 2015, 10:10:18 AM IST


ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఏర్పాటు కోసం రైతులు భూములను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక భూములను ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్రభుత్వం కొంత మొత్తాన్ని రైతులకు ఇస్తున్న సంగతి విదితమే. ఈ మొత్తంతో పాటు డెవలప్ చేసిన భూములను రైతులకు ఇవ్వాలని కూడా నిర్ణయించింది.

మొన్నటి వరకు డెవలప్ చేసిన భూములను ఎక్కడ ఇవ్వాలి అనే విషయంపై క్లారిటీ లేదు. దీనిపైనే తర్జన భర్జన జరుగుతున్నది. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. రాజధాని కోసం భూములను ఇచ్చిన రైతులకు రాజధాని ప్రాంతంలోనే డెవెలప్ చేసిన స్థలాలను ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఎంత స్థలం ఇవ్వాలి.. ఎంత వైశాల్యంలో రైతులకు ఇచ్చే స్థలాలు ఉండాలి అనే విషయాలపై సిఆర్డిఏ పరిశీలిస్తున్నది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ రాజధాని రైతులతో సమావేశం నిర్వహించి.. వారి అభిప్రాయాలను స్వీకరించింది. త్వరలోనే డెవెలప్ చేసిన భూములను రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇది రాజధాని రైతులకు ఆనందించదగిన విషయమనే చెప్పాలి.