టీడీపీతో కాంగ్రెస్ పొత్తు మంతనాలు.. అవసరమా?

Wednesday, July 25th, 2018, 08:52:24 AM IST


తెలుగు రాష్ట్రం విభజన తరువాత పాలనలో ఎంతవరకు మార్పు వచ్చిందో తెలియదు గాని రాజకీయాల్లో మాత్రం ఊహించని మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా పలు ముఖ్య పార్టీలు ఊహించని చేదు అనుభవాలను ఎదుర్కొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఆ పార్టీనే గెలుస్తుందని అంతా భావిస్తున్నారు.

ఇకపోతే ప్రతిపక్ష స్థానం కోసం మిగతా పార్టీలు కష్టపడుతున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో నిలుస్తుందని చెప్పవచ్చు. అయితే మరో వైపు భారత జనతా పార్టీ కూడా తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఆ విషయాన్ని పక్కనపడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆరెస్ పార్టీకి పోటీ ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. అయితే పొత్తులతో ముందుకు వెళితే ఎంతో కొంత లాభం ఉండవచ్చని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ తో కలవలేము కాబట్టి కాంగ్రెస్ పెద్దలు టిడిపి తో కలిస్తే బావుంటుందని ఓ ఆలోచనకు వచ్చినట్లు టాక్.

అయితే తెలుగుదేశం పార్టీ పేరు తెలంగాణలో పెద్దగా వినిపించడం లేదని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత ఎన్నికల్లో గెలిచిన వారంతా టీఆరెస్ లోకి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. రంగారెడ్డి మహబూబ్ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ ఉన్నప్పటికి పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. పైగా ఆంధ్రలో పార్టీకి ఊహించని విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని అదుపుచేసుకోవడానికే సమయం దొరకడం లేదు. ఇక టీడీపీ అధిష్టానం తెలంగాణలో సమయాన్ని వెచ్చించడం అంటే కష్టమే. కాంగ్రేస్ పార్టీకి ఉన్న మద్దతు కూడా ఆ పార్టీతో కలిస్తే పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఓటు బ్యాంకు కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరి ఇలాంటి మూమెంట్ లో ప్రతిపక్ష టీ నేతల హడావుడి ఏ విధంగా ఉంటుందో చూడాలి.