హుధుద్ సాయం 840కోట్లు మాత్రమే!

Tuesday, December 16th, 2014, 09:36:39 AM IST

hudhud
ఉత్తరాంధ్రను కుదిపేసిన హుధుద్ తుఫాను తాకిడికి విశాఖపట్నం నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. అయితే విశాఖకు ఎప్పుడూ లేనంత నష్టాన్ని కల్గించిన హుధుద్ నుండి కోలుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 840కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. కాగా తుఫాను అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖలో పర్యటించి వెయ్యి కోట్ల మేరకు తక్షణ సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ నేపధ్యంగా కేవలం 400కోట్ల రూపాయలు మాత్రమే విడుదల అయ్యాయి.

అలాగే ఇకపై మరో 440కోట్ల రూపాయల సాయాన్ని మాత్రమే విపత్తు నిధి నిబంధనల మేరకు అందించగలనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా సోమవారం ఆంధ్రప్రదేశ్ పునారావాస కమీషనర్ సుకుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనీల్ గోస్వామీని కలిసిన నేపధ్యంగా ఈ విషయంపై ఆయన స్పష్టతనిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కారు శాఖల వారిగా కోరిన నిధులను ఏక మొత్తంగా విడుదల చెయ్యడం సాధ్యం కాదని ఆయా శాఖలను సంప్రదించి నిధులను విడుదల చేయించుకోవాలని అనీల్ గోస్వామి పేర్కొన్నారు.