స్టాలిన్ సినిమాని స్పూర్తిగా తీసుకోమన్న చిరు

Tuesday, March 25th, 2014, 11:18:26 AM IST


రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీల తీర్థం పుచ్చుకోవడంతో, ఆ ప్రాంతంలో హస్తం పార్టీ బలహీన పడిపొయింది. బలహీన పడిన పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పరచడానికి ఆ పార్టీ ముఖ్య నాయకులు చాలా శ్రమిస్తున్నారు. ఎపిసిసి అధ్యక్షుడు రఘువీర రెడ్డి మరియు ప్రచార కమిటి చైర్మన్ చిరంజీవి బస్సు యత్రలతో, సభలతో కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం గుంటూరులో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ, ‘కార్యకర్తలు నిరుత్సాహానికి లోను కావద్దు. మీకు ఇదో గొప్ప అవకాశం. కాంగ్రెస్ పవర్ ఏంటో చూపించాలని. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమని, అది ఎక్కడ చెక్కు చెదరలేదని’ అన్నారు.

పోలవరం ప్రాజెక్టును ఆపడం ఎవరితరం కాదని హెచ్చరించారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయటం పట్ల తాను గర్విస్తున్నానని చిరంజీవి అన్నారు. వ్యక్తిగతంగా తాను సమైక్య వాదినని, రాష్ట్రంలోని అన్ని పార్టీలు విభజనకు అంగికరించి లేఖలు ఇచ్చిన తరువాతే కాంగ్రెస్ పార్టీ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసిందని వివరించారు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు కేవలం కాంగ్రెస్ మాత్రమే దోషి అని చెబుతున్నాయని అన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడు రోజు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రజలను మోసం చేసాడని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలు తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల కృషి ఎంతగానో ఉందని చిరంజీవి చెప్పారు. ‘స్టాలిన్’ సినిమా స్ఫూర్తితో ఒక్కో కార్యకర్త మరో ముగ్గురికి తెలంగాణ విషయంలో జరిగిన వాస్తవాలను వివరింఛి కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తేవాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు.