సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో నీలి ‘చిత్రాలు’..?

Friday, November 6th, 2015, 02:00:42 PM IST

kapilmohan
కర్ణాటక క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి, వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి కపిల్ మోహన్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. కాగా, అనేక అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని కపిల్ మోహన్ పై అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే ఈ ఏడాది ఆగష్టు 5న ఆయన నివసిస్తున్న గోల్డన్ గేట్ అపార్ట్ మెంట్ లోని ప్లాట్ నెం.602 లో సీఐడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రూ.4.30 కోట్ల నగదు, వజ్రాభరణాలు, వివిధ ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, 28 సీడీలు, ఒక హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం ఈ కేసును లోకాయుక్తకు అప్పగించింది. దీంతో స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, సీడీలు, హార్డ్ డిస్క్ లను లోకాయుక్త అధికారులు తీసుకున్నారు.

తాజాగా కేసు దర్యాప్తులో భాగంగా సీడీలను, హార్డ్ డిస్క్ ను పరిశీలించగా 20 సీడీలలో సాధారణ నీలిచిత్రాలు, ఒక సీడీలో చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఉన్నట్లు లోకాయుక్త పోలీసులు గుర్తించారు. వెంటనే ఈ విషయమై లోకాయుక్త సంస్థ ఏడీజీపీ ప్రేమ్ కుమార్ మీన బెంగుళూరు నగర పోలీస్ కమీషనర్ మేఘరిక్ కు లేఖ రాసి ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని సూచించారు. ఈ నేపధ్యంలో కమీషనర్ మేఘరిక్ సూచనల మేరకు బెంగుళూరు యశ్వంతపుర పోలీస్ స్టేషన్ లో తాజాగా కపిల్ మోహన్ పై ఐటీ యాక్ట్ – 67బీ ను అనుసరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.