బాధితులు ఇంటికి చేరేవరకూ ఢిల్లీ వీడను: బాబు

Tuesday, June 25th, 2013, 02:38:35 PM IST

chandra babu in delhi

వరదల్లో చిక్కుకొని ఎపి భవన్ కు వచ్చిన తెలుగువారికి సహాయాన్ని అందించకుండా తమను అడ్డుకుంటున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తరాఖండ్ కు వెళ్లిన తెలుగు వారు క్షేమంగా ఇంటికి చేరేవరకూ ఢిల్లీ నుంచి కదిలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులకు మానవత్వంతో సాయం అందిద్దామనే ఢిల్లీకి వచ్చానన్నారు. బాధితులకు వెంటనే సాయం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మరోసారి విమర్శించారు. తెలుగు వారి పట్ల వివక్ష చూపారని ఆరోపించారు.

ఎపి భవన్ లో ఉన్న యాత్రికులకు వైద్య సేవలందించే నిమిత్తం మంగళవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు బాబు ప్రయత్నించారు. వైద్య శిబిరానికి అధికారులు అనుమతిని నిరాకరించారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు ఎపిభవన్ ఎదుట వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. తాము సహాయం చేయడానికి ముందుకు వస్తే ప్రభుత్వం అక్కసుతో అడ్డుకుంటుందని విమర్శించారు. వరదల్లో చిక్కుకొని తెలుగువారు ఇబ్బందులు పడుతుంటే వారికి సహాయక చర్యలు అందించాల్సిన ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తూ మానవత్వంలేకుండా వ్యవహరిస్తోందన్నారు.