మంత్రులపై సీఎం గారి ఆగ్రహం!

Thursday, April 23rd, 2015, 02:00:33 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. కాగా విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించగా, అక్కడ స్థల సేకరణ వివాదం అంశాన్ని మంత్రులు సరిగ్గా డీల్ చెయ్యడం లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే ఎయిర్ పోర్టుకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అక్కడి రైతులతో మాట్లాడాలని విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మంత్రులకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇక సమస్య పరిష్కారానికి ఉత్తరాంధ్ర మంత్రులు చొరవ తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చిర్రుబుర్రు లాడినట్లు సమాచారం. కాగా విశాఖపట్నంలో విమానాశ్రయం ఉండగా మరలా విజయనగరం జిల్లా భోగాపురంలో మరో ఎయిర్ పోర్ట్ ఎందుకని, ఈ విషయంలో ప్రభుత్వం దిక్కుమాలిన నిర్ణయం తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే.