నేటిఏపి స్పెషల్ : తెలంగాణలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్ధులు

Saturday, May 17th, 2014, 03:58:12 PM IST


విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ 2014 సార్వత్రిక ఎన్నికలు మంచి ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. ఇటీవల విడుదలైన ఫలితాలలో తెలంగాణాలో తెరాస పార్టీ, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి తయారుగా ఉన్నాయి.
తెలంగాణ సెంటిమెంట్ తో కెసిఆర్ ఆ ప్రాంతంలో నెగ్గుకు రాగా సీమాంధ్రలో విభజన అంశంగా కాంగ్రెస్ పై ప్రజల తిరిగుబాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై ఉన్న అవినీతి కేసులు టిడిపి నేత చంద్రబాబుకు పట్టంగట్టాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ తెరాస పార్టీకి గట్టి పోటీని ఇచ్చినప్పటికీ కారు తన వేగాన్ని పెంచి హస్తం అందుకోలేనంత వేగంగా ముందుకు దూసుకుపోయింది. అయితే తెలంగాణాలో ఏ జిల్లా నియోజకవర్గంలో ఏయే అభ్యర్ధులు అత్యధిక మెజారిటీతో గెలిచారో ఇప్పుడు విశదీకరిద్దాము.

తెలంగాణలో అత్యధిక మెజారిటీ పొందిన మొదటి ఐదుగురు అభ్యర్ధులు
1. అత్యధిక మెజారిటీ పొందిన అభ్యర్ధులలో మొదటగా హైదరాబాద్ జిల్లా బహుదూర్ పురా నియోజకవర్గంలో మజ్లీస్ పార్టీ అభ్యర్ధి మొజంఖాన్ తన సమీప ప్రత్యర్ధి టిడిపినేత అబ్దుల్ రహమాన్ పై 94,981 ఓట్ల మెజారిటీతో భారీ విజయం నమోదు చేసుకున్నారు.
2. రెండవ స్థానంలో మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గంలో తెరాసనేత హరీష్ రావు తన ప్రత్యర్ధి కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గౌడ్ పై 93,368ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు.
3. మూడవ స్థానంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట(ఎస్సి) నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి ఆరూరి రమేష్ తన ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
4. నాలుగవ స్థానంలో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి ఏ గాంధి తన సమీప ప్రత్యర్ధి తెరాస నేత శంకర్ గౌడ్ పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
5. ఇక ఐదవ స్థానంలో కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గంలో తెరాసనేత దాసరి మనోహర్ రెడ్డి తన ప్రత్యర్ధి కాంగ్రెస్ నేత భానుప్రసాద్ రావుపై 62,677 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

వీరే తెలంగాణలో ప్రత్యర్ధుల పై భారీ విజయంతో గెలుపొందిన వీరనేతలు. మరి అత్యంత ప్రజాభిమానాన్ని పొందిన ఈ నేతలంతా ప్రజల నమ్మకాన్ని ఒమ్ముకానీయకుండా నీతినిజాయితీలతో పాలన సాగిస్తారని ఆశిద్దాం.