కర్నూలు కీలక నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి టీడీపీలోకి ఎంటరవుతుండటంతో జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక రాజకీయ భవితవ్వం దాదాపుగా ప్రశ్నార్థకంలో పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో తన టికెట్ కోసం డిమాండ్ చేయాల్సిన ఆమె ఏది ఇస్తే అది ఓకే అనే స్థాయికి చేరినట్టు కర్నూలు జిల్లా నేతలు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కీలక నేతలకు చంద్రబాబు నాయుడు టికెట్లని కన్ఫర్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తన టికెట్‌పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని బుట్టా రేణుక చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇటీవల శ్రీమల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న బుట్టా రేణుక టీడీపీలో తన స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నూలు పార్లమెంట్ స్థానంకు సంబంధించి సమీక్షించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని, ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నానని వెల్లడించింది. అయితే ఎంపీగా, లేక ఎమ్మెల్యేగా తనని పోటీకి దింపుతారా అన్న విషయంలో పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం కొంత ఇబ్బందికరంగా వుందని, అయితే తనకు సానుకూలమైన నిర్ణయమే వస్తుందని ఆశాభావంతో వున్నట్లు బుట్టా రేణుక చెప్పడం జిల్లాలో ఆమె పట్టుకోల్పోతున్నదని స్పష్టమౌతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.