సమీక్ష : భైరవగీత

Thursday, December 13th, 2018, 09:36:15 PM IST

నూతన దర్శకుడు సిద్దార్థ దర్శకత్వంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందింన చిత్రం ‘భైరవగీత’. కాగా డిసెంబర్ 14వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. కానీ స్పెషల్ రెడ్ కార్పెట్ ప్రీమియర్ షో మేం ముందుగానే చూడటం వల్ల ఈ రివ్యూ రావడం జరిగింది.

కథ :

రాయలసీమ నేపధ్యంలో సాగే ఓ హింసాత్మక ప్రేమకథ ఈ ‘భైరవగీత’. తక్కువ కులంలో పుట్టిన భైరవ (ధనుంజయ్) ఆ ఊరికి పెద్ద అయిన పెద్ద కులం అయిన సుబ్బా రెడ్డి దగ్గర పని చేస్తుంటాడు. భైరవ తాతల దగ్గర నుంచి ఇలా తరతరాలకు బానిసలుగానే ఉంటుంటారు. ఈ క్రమంలో సుబ్బా రెడ్డి కూతురు గీత (ఇర్ర మోర్) పై అటాక్ జరుగుతుంది. భైరవ ప్రాణాలకు తెగించి గీతను కాపాడతాడు. ఇక అన్నీ సినిమాల్లో లాగానే హీరోయిన్ హీరోతో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమను ఆమె తండ్రి అంగీకరించడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య భైరవ తమ బానిస బతుకులను మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? వారి పై ఎలా తిరుగుబాటు చేశాడు ? చివరకి భైరవ మరియు గీత కలుస్తారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుంజయ్ తన పాత్రకు తగ్గట్లు… తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిన్ ఫాదర్ సుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో గాని, ప్రీ క్లైమాక్స్ సన్నివేశంలో గాని ధనుంజయ్ చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన ఇర్రా మోర్ కొన్ని బోల్డ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. దర్శకరచయితలూ రాసుకున్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ..కథలో ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకొన్నే విధంగా లేదు. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. యాక్షన్ సీన్లు బాగానే పెట్టారు గాని అవి థ్రిల్ చెయ్యవు. దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారనిపిస్తోంది. అవసరానికి మించి హింసాత్మక సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. ఈ రిపీట్ డ్ సీన్స్ మరీ ఎక్కువడంతో సినిమా ఫలితమే దెబ్బ తింది. అన్నిటికిమించి కథ కూడా చాలా పాతగా ఉంది.

ప్లస్ పాయింట్స్:

ధనుంజయ్ నటన.
హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ
హీరోకి, హీరోయిన్ ఫాదర్ కి మధ్య సాగే సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

బలహీనమైన కథ.
కథనం ఆసక్తికరంగా సాగకపోవడం.
పైగా యాక్షన్ సీన్స్ ఓవర్ గా అనిపించడం. సినిమాలో సరైన ప్లో లేకపోవడం.

తీర్పు:

నూతన దర్శకుడు సిద్దార్థ దర్శకత్వంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా తెరకెక్కపోగా.. నిరుత్సాహ పరుస్తోంది. చంటి, ఒసేయ్ రాములమ్మ చిత్రాలను కలిపి కథ అల్లితే భైరవ గీత గుర్తుకు రావడం బాధాకరం. కానీ ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుంజయ్ తన నటనతో ఆకట్టుకుంటాడు. అయితే దర్శకుడు ఈ సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని హింసాత్మక సన్నివేశాలతో, ప్లో లేని స్క్రీన్ ప్లే తో, చాలా చోట్ల లాజిక్ మిస్ అవ్వడం లాంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తం మీద ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోదు.

Rating : 2.5/5