కేజ్రివాల్ కు అందని ఆహ్వానం!

Saturday, January 24th, 2015, 06:54:25 PM IST

kejriwal-1
భారత గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంగా అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అభ్యర్ధి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కు ఆహ్వానం అందలేదట. అయితే తనకు గణతంత్ర్య వేడుకలలో పాల్గొనాలని ఉందని అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. అలాగే తనను ఎందుకు పిలవలేదో తెలియదని అయినా తాను వెళ్ళాలని అనుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఒబామా వస్తున్న సందర్భంగా గణతంత్ర్య వేడుకలు జరిగే ప్రాంతంతో పాటు ఢిల్లీ నగరం మొత్తం భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ మేరకు ఆహ్వానితుల సంఖ్యను కూడా పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం చూస్తే మాజీ ముఖ్యమంత్రులను రిపబ్లిక్ డే వేడుకలకు పిలవరని భాజపా పేర్కొంటోంది. కానీ కేజ్రివాల్ మరీ వెళ్ళాలని అనుకుంటే మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.