కేరళ బాధితులకు యాపిల్ భారీ సాయం!

Sunday, August 26th, 2018, 01:52:55 AM IST

ఇప్పటికే కేరళలో కురిసిన భారీ వర్షాలకు ఆ రాష్ట్రం ఎంతో అతలాకుతలం అయింది. కాగా వరదల్లో మొత్తం ఇప్పటివరకు దాదాపు 420 మంది మృత్యువాత పడ్డట్లు కేరళ ప్రభుత్వం చెపుతోంది. అయితే ఈ వరదల వల్ల కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అయిన విషయం తెలిసిందే. కాగా అటువంటి వారి కోసం ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఇల్లు పోగొట్టుకున్నవారికి కొంత మొత్తాన్ని వారి వారి ఖాతాల్లో జమచేసేందుకు సిద్ధమవుతోంది. ఇక వరదల్లో నష్టపోయినవారికి పునరావాసం కల్పించి ఎప్పటికపుడు భోజన మరియు వసతి ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ జలవిలయంలో సతమతమైన కేరళ ప్రజలను ఆదుకోవడానికి పలు రాష్ట్రాలు, మరియు ప్రముఖులు మరియు ఎన్నారైలు తమవంతుగా విరాళాలు, ఇతర వస్తురూపేణ సహాయాలు చేస్తూ తమ ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే పలు సంస్థలు కూడా వరదల్లో నష్టపోయిన వారికీ సాయం అందిస్తుండగా, నేడు అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ రూ.7కోట్ల రూపాయలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ సాయాన్ని వారు మెర్సీ కార్ప్స్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేయనున్నట్లు తెలిపింది. అంతే కాదు తమ కస్టమర్లను కూడా తమ వంతుగా బాధితులకు సాయం అందించాలని, అందునిమిత్తం తమ యాపిల్ యాప్ స్టోర్, మరియు ఐ ట్యూన్స్ స్టోర్స్ ద్వారా ఆ యాప్స్ లో మెర్సీ కార్ప్స్ వారు ఏర్పాటు చేసిన డొనేషన్స్ అనే బటన్ ని క్లిక్ చేసిన తమవంతు సాయం అందించమని కోరుతోంది. కాగా యాపిల్ తన వంతు సాయాన్ని అందించడానికి ముందుకు రావడంతో పలువురు అభినందిస్తున్నారు….