‘అన్న’ క్యాంటీన్ నిర్వహణ ఇలా..

Friday, September 19th, 2014, 06:58:30 PM IST


తమిళనాట సూపర్ హిట్టయిన ప్రభుత్వ పథకం ‘అమ్మ క్యాంటీన్’ తరహాలో ఏపీ లో కూడాఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా 4 జిల్లాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీ సర్కార్.. క్యాంటీన్ల నిర్వహణలో తమిళనాడు అనుసరిస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు చెన్నైలో స్టడీ టూర్ నిర్వహించింది. ఏపీ మంత్రులు, అధికారుల బృందం చెన్నైలో అమ్మ క్యాంటీన్లను పరిశీలించారు. క్యాంటీన్ల నిర్వహణ తీరు, అందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు, స్థలం, నిధుల సమీకరణ, ముడి సరుకుల సేకరణ తదితర అంశాలలో చెన్నై అధికారులు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.

మంత్రుల బృందంలో పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, నారాయణ ఉన్నారు. వీరితో పాటు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. చెన్నైలోని అమ్మ క్యాంటీన్ల నిర్వహణను పరిశీలించిన మంత్రులు దీనిపై ఓ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనున్నారు.

ఏపీలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు రామకృష్ణ మిషన్‌, ఇస్కాన్‌ సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. వచ్చే మంత్రిమండలి సమావేశంలో అన్న క్యాంటీన్లను ఎప్పటినుంచి ప్రారంభించాలనే విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం, రూపాయికి ఒక ఇడ్లీ, సాంబార్, 3 రూపాయలకు రెండు చపాతీలు అందించనున్నారు. తొలుత నాలుగు జిల్లాల్లో ఏర్పాటు చేసి… ఆ తర్వాత దశల వారీగా అన్ని జిల్లాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారు. ప్రతి క్యాంటీన్ వద్ద వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి… రక్షిత మంచినీటిని అందించాలని యోచిస్తున్నారు. అన్న క్యాంటీన్లకు మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది.