ప్రీమియర్ షో టాక్ : ‘ఆనందో బ్రహ్మ’ – భయపెట్టిందా..నవ్వించిందా..!!

Friday, August 18th, 2017, 09:22:51 AM IST


సొట్ట బుగ్గల సుందరి తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. ఈ మధ్య కాలంలో హీరోయిన్లను ప్రధానపాత్రల్లో పెట్టి వారి చుట్టూ అల్లిన హర్రర్ కామెడీ కథతో చాలా చిత్రాలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందింది. తాప్సితో పాటు ఈ చిత్రంలో కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ మరియు వెన్నెల కిషోర్ లు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న తాప్సి ఈ చిత్రానికి మంచి ప్రచారాన్ని కల్పించింది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూఎస్ లో ఇప్పటికే పూర్తి చేసుకున్న ప్రీమియర్ షోల వివరాలను బట్టి ఈ చిత్రం ఎలా ఉంది ? హర్రర్ కామెడీగా వచ్చిన ఈ చిత్రం అందుకు తగ్గట్లుగానే ఉందా ? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

నలుగురు కమెడియన్లు ఈ చిత్రంలో ఉన్నారంటే ప్రేక్షకులు కచ్చితంగా మంచి కామెడీని కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగానే ఆనందో బ్రహ్మ ఉంది. ఊహించిన విధంగానే హర్రర్ కామెడీ చిత్రమే అయినా కథలో మాత్రం తాజాదనం ఉంది. పాత్రల పరిచయాలు, మంచి కామెడీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ని దర్శకుడు ఆసక్తికరంగా ముగించాడు. సెకండ్ హాఫ్ లో కామెడీ తార స్థాయికి చేరిందనే చెప్పాలి. నలుగురు ప్రధాన నటుల మధ్య వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. షకలక శంకర్ మరియు వెన్నెల కిషోర్ లు తమకే సాధ్యమైన కొన్ని మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్ కూడా మెప్పించాడు. శ్రీనివాస్ రెడ్డి పాత్రకు కథలో ప్రాధాన్యత ఉంది. తాప్సి పాత్ర చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా దర్శకుడు మహి వి రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.