సముద్రంలో విమాన భారీ శకలాలు గుర్తింపు!

Saturday, January 3rd, 2015, 01:49:38 PM IST


ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతూ మార్గం మధ్యలో జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానానికి చెందిన రెండు భారీ శకలాలను గత అర్ధరాత్రి గుర్తించినట్లు ఆ దేశానికి చెందిన ఒక ఉన్నతాధికారి మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా ఈ భారీ శకలాలను సముద్రంలో దాదాపు 90మీటర్ల అడుగు భాగంలో గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఇక వాతావరణం అనుకూలిస్తే వాటిని ఈ రోజు వెలికి తీసేందుకు చర్యలు చేపడతామని ఇండోనేషియా అధికారి పేర్కొన్నారు. కాగా 155మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో ఇండోనేషియా నుండి సింగపూర్ కి బయలుదేరిన విమానం మధ్యలోనే సముద్రంలో కుప్పకూలిపోవడంతో మొత్తం ప్రయాణికులు అందరూ మరణించారు. అయితే ఇప్పటివరకు 30 మృతదేహాలను మాత్రమే సహాయక సిబ్బంది సముద్రం నుండి వెలికి తీయగలిగారు.