గ్రేటర్‌లో మేయర్ ఎన్నికను వెంటనే నిర్వహించాలి – బండి సంజయ్

Thursday, December 24th, 2020, 08:01:18 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు ఖమ్మంకు చెందిన టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని అన్నారు. గ్రేటర్‌లో మేయర్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అయితే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూసుకున్నాక తండ్రీ, కొడుకులకు దిమ్మతిరిగిందని అందుకే చేసేదేమి లేక ఇప్పుడు బీజేపీ కార్పోరేటర్లను డబ్బుతో కొనాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ కార్పోరేటర్లకు టీఆర్‌ఎస్‌ రూ.5 కోట్లు ఆఫర్ చేస్తుందని, టీఆర్ఎస్ మా జోలికొస్తే వాళ్ల ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామని హెచ్చరించారు. అయితే పోలీసూకు 15 నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే జల్లెడ పట్టి రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాళ్లను బయటకు తీస్తారని అన్నారు.